Posts Tagged ‘అనువాదం’

రాజుగారూ- నలుగురు అమ్మాయిలూ

మే 12, 2009

చాలా కాలం క్రిందట ఓ రాజుగారు ఉండేవారు. ఉదయంపూట దర్బారులో రాచకార్యాలు నెరపిన తరువాత, రాత్రిపూట ఆయన మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల బాగోగులు తెలుసుకునేవాడు.

ఓసారి అలా నగర సంచారం చేస్తుండగా ఓ ఉద్యానవనంలో‌చెట్లమధ్య, దీపాల వెలుతుర్లో కూర్చొని ముచ్చటించుకుంటున్న అమ్మాయిలు నలుగురు కనిపించారు. చర్చ ఏదో రసవత్తరంగా సాగుతోందని రాజుగారూ ఆ ప్రక్కగా నిలబడి వినటం మొదలుపెట్టారు. మొదటి అమ్మాయి అంటోంది- “అన్ని రుచుల్లోకీ మాంసం రుచే గొప్పగా ఉంటుంది” అని.

“నేను ఒప్పుకోను. చక్కని ద్రాక్ష సారాయిని మించిన రుచి ప్రపంచంలో దేనికీ ఉండదు” అని రెండో అమ్మాయి.

“లేదు లేదు. మీరిద్దరు చెప్పిందీ తప్పే. ప్రపంచంలో ప్రేమకంటే తీయనిది ఏదీ లేదు” అన్నది మూడో పిల్ల.

ఇక నాలుగో అమ్మాయి అంటున్నది- “మాంసం, సారాయి, ప్రేమ- ఇవన్నీ తీయనివే, కాదనను. కానీ అబద్ధాలు చెప్పటంలో ఉండే రుచి వీటిల్లో దేంట్లోనూ లేదు” అని.

అంతలో ఎవరో వచ్చి పిలవటంతో ఆ నలుగురూ లేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. వీళ్లమాటల్ని శ్రద్ధగా విన్న రాజుగారు ఎవరు ఏ ఇంటికి వెళ్ళారో గుర్తు పెట్టుకొని, ఆ పైన ఆ ఇళ్ల తలుపులమీద సుద్దతో గుర్తులు పెట్టి, చక్కా పోయారు.

మరునాడు ఉదయం రాజుగారు మంత్రిని పిలిచి, ఉద్యానవనానికి దగ్గర్లో సుద్ద గుర్తులున్న ఇళ్ళ యజమానుల్ని- వాళ్ల పిల్లల్తో సహా తన అంత:పురానికి రప్పించమని, నాలుగు పల్లకీలనిచ్చి పంపాడు.

నలుగురూ రాగానే, రాజుగారు వాళ్లని ముందుగదిలో కూర్చోమని, తాను ఒక్కొక్కరితోటీ విడివిడిగా మాట్లాడారు. మొదటి అమ్మాయిని పిలిచి అడిగారు: తల్లీ, నిన్న రాత్రి నువ్వు నీ స్నేహితురాళ్లతో కలిసి చెట్టుక్రింద కూర్చున్నప్పుడు ఏదో అంటూ ఉన్నావు, ఏమిటది?’ అని.

“మీకు వ్యతిరేకంగా ఏమీ అనలేదు, ప్రభూ!” అన్నదా అమ్మాయి.

“అవును, ఆ సంగతి నాకుతెలుసు. కేవలం నిన్న నువ్వు ఏమన్నావో చెప్పు, చాలు” అన్నారు రాజుగారు.

‘ “అన్ని రుచుల్లోకీ మాంసపు రుచి చాలా గొప్పది” అన్నాను ప్రభూ!’ అన్నది ఆ అమ్మాయి.

“సరే, నువ్వెవరి బిడ్డవు?” అడిగారు రాజుగారు.

నేను భాభ్రా జాతి బిడ్డను” అన్నదా అమ్మాయి.

“మరైతే నీకు మాంసపు రుచి ఎలా తెలుసు? మీ జాతివాళ్ళు మాంసాన్ని ముట్టనైనా ముట్టరు కదా? పురుగులేమైనా వస్తాయేమోనని, త్రాగే నీళ్ళను సైతం వడబోసుకొని త్రాగుతారే?” అన్నారు రాజుగారు.

“నిజంచ్ ఎప్పారు మహారాజా! కానీ‌మాంసం అత్యంత రుచికరమైనదని నేను గమనించి తెలుసుకున్నాను. మా ఇంటికి దగ్గర్లోనే ఒక కసాయి దుకాణం ఉన్నది. నేను చూశాను- జనాలు మాంసం కొన్న తరువాత ఒక్క చిన్న ముక్కని కూడా వృధా చేయరు. ఒక్క ముక్కనికూడా పారెయ్యరు. బహుశ: అది చాలా విలువైనది అయిఉండాలి. వాళ్ళు మాంసం వండుకొని తినేసి, ఎముకల్ని బయట పడేస్తే, కుక్కలు ఆ ఎముకల్ని దొరక పుచ్చుకొని బాణం ములుకుల మాదిరి చప్పరించివేస్తాయి. ఆ తరువాత కాకులు వచ్చి, మిగిలిన ముక్కల్నీ ఎత్తుకుపోతాయి. ఒకసారి కాకులు తమపని ముగించిన తరువాత, చీమల గుంపులు మిగిలినవాటిని ఎత్తుకెళ్తాయి. ఇవన్నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాయి” అన్నదా అమ్మాయి.

రాజుగారికి ఆమె విశ్లేషణా చాతుర్యం నచ్చింది. “చక్కగా చెప్పావు తల్లీ, మాంసం నిజంగానే చాలా రుచిగా ఉంటుంది” అని, ఆయన ఆమెకు ఒక చక్కని బహుమతినిచ్చి పంపాడు.

ఆ తరువాత, రెండవ అమ్మాయిని పిలిచి, రాజుగారు ఆమెనూ అడిగారు- ” నిన్న రాత్రి చెట్టుక్రింద కూర్చొని, నువ్వు ఏమి అన్నావు?” అని.

“మీ గురించి ఏమీ అనలేదు ప్రభూ, ప్రసంగంలో భాగంగా ‘ద్రాక్ష సారాయిని మించిన రుచి వేరే దేనిలోనూ ఉండదు ‘ అన్నాను నేను” అన్నదా అమ్మాయి.

“ఓహో, నువ్వెవరి పిల్లవు?” అడిగారు రాజుగారు.

“నేను పూజారిగారి అమ్మాయిని” అని బదులిచ్చింది ఆ పిల్ల.

“ఊ, ఇదేదో చోద్యంగానే ఉన్నది. పూజారికీ, ద్రాక్ష సారాయికీ ఆమడ దూరం ఉండాలే, మరి నీకు ద్రాక్షసారాయిలో రుచి ఎలా తెలిసింది?” అని అడిగారు, రాజుగారు.

ఆ అమ్మాయి అన్నది:” నేను ఏనాడు సారాయిని రుచి చూడలేదన్నది నిజమే. కానీ అదెంత రుచిగా ఉంటుందో ఊహించగలను, నేను. నేను మా యింటి మేడమీద అటూ ఇటూ తిరుగుతూన్నప్పుడు, క్రింద వీధిలోజరిగే సంగతులన్నీ కనబడుతుంటాయి. మా వీధిలోనే ఒక సారాయి దుకాణం ఉన్నది. ఒక రోజున, మంచి విలువైన దుస్తులు ధరించిని ఇద్దరు వచ్చి, అక్కడ కూర్చొని, ద్రాక్షసారాయిని త్రాగారు. ఆ తరువాత వాళ్ళు లేచి, తూలుకుంటూ నడవగా, నేను పైనుండి చూసి అనుకున్నాను-“వీళ్లను చూడు, రోడ్డుమీద దుమ్ములోను, బురదలోను పడుతూ, లేస్తూ, దోడలకు గుద్దుకుంటూ, అడుగడుక్కీ తూలుతూ ఎలా పోతున్నారో చూడు? ఈ అనుభవంతో వాళ్ళు జన్మలో ఇక సారాయిని ముట్టరు మళ్ళీ” అని. కానీ నా ఊహ తప్పని తేలింది. వాళ్ళు తరువాతి రోజునే వచ్చారు, మళ్ళీ అదే పని చేసి, మళ్ళీ అలాగే ప్రవర్తించారు. అప్పుడు నేను అనుకున్నాను-” ద్రాక్షసారాయి చాలా రుచికరంగా ఉండి ఉండాలి. లేకపోతే మనుషులు దానికోసం ఇన్ని పాట్లు ఎందుకు పడతారు?” అని.

“అవును తల్లీ, నువ్వు సరిగానే ఊహించావు. ద్రాక్ష సారాయి నిజంగానే చాలా రుచిగా ఉంటుంది” అని రాజుగారు ఆమెకో బహుమతిని ఇచ్చి పంపారు.

ఆ తరువాత ఆయన మూడో అమ్మాయిని పిలిచి అడిగారు- “నిన్నరాత్రి నువ్వు ఏదో అంటున్నావు, మీ స్నేహితురాళ్లతో- ఏంటమ్మా అది?” అని.

“ఆమె అన్నది-“మీ గురించి ఏమీ అనలేదు ప్రభూ, ఏదో చర్చ జరుగుతుంటే ‘ ప్రేమించడంలోని తియ్యదనం వేరే ఎందులోనూ లేదు ‘ అన్నాను మహారాజా” అని.

” అయ్యో, చూస్తే నువ్వింత చిన్న పిల్లవు!? అప్పుడే అలాంటి సంగతులు ఎలా మాట్లాడగల్గుతున్నావు? ఇంతకీ ఎవరి అమ్మాయివి, నువ్వు?” అడిగారు రాజుగారు.

“నేనొక వీధిగాయకుని బిడ్డను” అన్నదా అమ్మాయి. “నేనింకా చిన్న పిల్లనే, కానీ నాకు కళ్ళు, చెవులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడు పుట్టినప్పుడు మా అమ్మ ఎంతో కష్టపడింది. ఆమె బ్రతుకుతుందని అనుకోలేదు ఎవ్వరూ. అయినా, ఆమె కోలుకున్న వెంటనే ప్రేమికుల్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్లిపోయింది. అందుకనే, ‘ప్రేమించటంలోని మాధుర్యం వేరే ఎందులోనూ ఉండదన్నాను నేను” అన్నది.

“బాగా చెప్పావు తల్లీ” అని రాజుగారు ఆమెకూ బహుమతినిచ్చి పంపారు.

ఆ తరువాత రాజుగారు నాలుగవ అమ్మాయిని అదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమెకూడా “రాజుగారిని నేనేమీ అనలేదు” అన్నది.
“అయిఉండవచ్చు; కానీ నువ్వన్నదేమిటి?” అడిగారు రాజుగారు.

“అబద్ధాలు చెప్పటంలో ఉండే రుచి, అందరికీ తెలుసునన్నాను నేను.”

“నువ్వెవరి బిడ్డవు?”

“నేను రైతు బిడ్డను”.

“అబద్ధాలు చెప్పటం బాగుంటుందని నీకెలా తెలుసు?” అన్నారు రాజుగారు.

చురుకుగా ఉంది ఆ అమ్మాయి- అన్నది: ” ప్రతివాళ్లూ అబద్ధాలు చెబుతారు. ఓహ్, దానిదేముంది? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పారో, లేదో గాని, సందర్భం వస్తే మీరూ అబద్ధం చెబుతారు ఏదో ఒకనాడు!” అని.

“నేనా?! ఎలా?!” అన్నారు రాజుగారు.

“నాకు రెండు లక్షల బంగారు నాణాలు, ఆరు నెలల గడువూ ఇవ్వండి. మీరూ అబద్ధాలు ఆడతారని ఋజువు చేస్తాను.” అన్నదా అమ్మాయి ధైర్యంగా.

రాజుగారు కొంచెం ఆలోచించి, సరేనన్నారు. ఆమెకు రెండు లక్షల వరహాలు ఇచ్చి, ఆరునెలలు ఆగేందుకు అంగీకరించారు. ఈ ఆరు నెలల్లోనూ, ఆ అమ్మాయి రాజుగారి డబ్బుతో గొప్ప భవంతిని ఒకదాన్ని నిర్మించింది. ఆ భవంతి లోపలి గోడలు నున్నగా, పట్టు పరదాల మాదిరి ఉన్నాయి. దానిలోని చిత్రాలు, శిల్పాలు అత్యంత రమణీయంగాను, అనుపమానంగాను ఉన్నై. ఆరు నెలలుగడుస్తాయనగా, ఆమె రాజుగారి వద్దకు వచ్చి అన్నది: “మహారాజా, రండి, నేను మీకు భగవంతుడిని చూపిస్తాను” అని.

కుతూహలం కొద్దీ రాజుగారు ఇద్దరు మంత్రుల్ని వెంటబెట్టుకొని ఆమె వెంట బయలుదేరారు.

ఆమె వాళ్లని తన భవంతి దగ్గరకు తీసుకు పోయింది. అక్కడ, దాని వాకిట వాళ్లను నిలిపి, “ఇదే, భగవంతుడు నివాసముండే చోటు. కానీ ఆయన గుంపుగా వెళ్తే కనబడడు. ఒక్కొక్కసారీ ఒక్కరికే దర్శనమిస్తాడాయన. అయితే, ఎవరి తల్లులు శీలవతులు కారో, పతివ్రతలు కారో, అలాంటి వాళ్లకి ఆయన దర్శనం లభించనే లభించదు. ఇక మీరు ఒక్కరొక్కరుగా లోనికి పోయి రండి” అన్నది.

రాజగారు సరేనని, తన మంత్రుల్లో ఒకరిని లోనికి పంపారు. ఆయన లోపలికి వెళ్ళి, అంతటా తిరిగి చూశాడు. చక్కని ఆ భవనం నిజంగానే భగవంతుని నివాసస్థలం మాదిరి పవిత్రంగా ఉన్నది. కానీ ఎంత వెతికినా అందులో ఆయనకు భగవంతుని దర్శనం మాత్రం కాలేదు. అప్పుడా మంత్రి అనుకున్నాడు- ఏమో, ఎవరి చరిత్ర ఎలాంటిదో ఎవరికి తెలుసు? నేనిప్పుడు బయటికి పోయి దేవుడు కనబడలేదని చెప్పుకోలేను. మా అమ్మ నడవడినే శంకిస్తారు అందరూ. అందుకని, నాకు భగవంతుడు కనిపించాడని చెబుతాను నేను…” -ఇలా అనుకొని, ఆయన బయటికి వచ్చాడు. రాజుగారు ప్రశ్నించినప్పుడు, ఆయన ఎలాంటి తడబాటూ లేకుండా బొంకాడు- “మిమ్మల్ని చూస్తున్నంత్ అస్పష్టంగా చూశాను దేవుడిని” అని.

“అవునా?, ఆయన్ని దర్శించారా? మీరున్నూ?” అన్నారు రాజుగారు. “దర్శించాను, నిజంగా!!”
“ఆయన మీతో ఏమన్నారు?” అడిగారు రాజుగారు. ” తను చెప్పిన సంగతుల్ని ఎవరికీ చెప్పద్దన్నారు ప్రభూ!” అన్నాడు మంత్రి తెలివిగా.

రాజుగారు రెండో మంత్రిని లోపలికి పంపాడు. లోపలికైతే వెళ్ళాడుగానీ, ఆయన గుండెలు పీచుమంటూనే ఉన్నాయి: ‘ఏమో, నాచరిత్ర ఎలాంటిదో, ఏమో?” అని. అద్భుతమైన ఆ భవన మధ్యంలో నిలబడి ఆ మంత్రిగారు అనుకున్నారు- “నాకు భగవంతుడు కనబడలేదంటే, ఖచ్చితంగా మా తల్లి శీలవతి అయిఉండదు. కానీ నేను ఆ సంగతిని ఒప్పుకుని, బహిరంగంగా అవమానాన్ని ఎలా, భరించేది? దానికంటే, దేవుడిని చూసినట్లు నటించటమే మంచిది.” -ఇలా అనుకొని, మంత్రి గారు నవ్వు ముఖంతో బయటికి వచ్చారు. రాజుగారు అడిగితే “నేను భగవంతుడిని చూడటమే కాదు, మాట్లాడాను కూడా.” అన్నాడు.

ఇప్పుడిక రాజుగారి వంతు వచ్చింది. ఆయన ధైర్యంగా భవంతిలోకి ప్రవేశించాడు; కానీ ఎంత వెతికినా భగవంతుని ఛాయకూడ లేదక్కడ! క్రమంగా ఆయనకూ ధైర్యం సన్నగిల్లింది. తన పుట్టుక మీద తనకే అనుమానం వేయటం మొదలైంది. ” మా మంత్రిగార్లిద్దరికీ భగవద్దర్శనమైంది. వారిద్దరూ ఉత్తమ సంజాతులేనని స్పష్టమైంది. మరి, నేను- మహారాజును- కళంక చరిత్రుడినా? అందుకనే నాకు భగవంతుడు కనబడటం లేదా? దీన్ని అంగీకరిస్తే అంతా గందరగోళం కాగలదు. అందుకని నేను భగవంతుని దర్శించానని చెప్పవలసిందే.” -ఇలా అనుకున్నాక రాజుగారు బయటికి వచ్చి మిగిలిన వారిని కలిశారు.
అక్కడే నిలబడి ఉన్న అమ్మాయి, అడిగింది రాజును: ” చెప్పండి మహారాజా, మీకు భగవంతుడు దర్శనమిచ్చాడా?” అని.

“అవును. నేను చూశాను ఆయన్ని.” అన్నారు రాజుగారు.

నిజంగానే!?” అన్నదా అమ్మాయి.

“అవును నిజంగా దర్శించాను” అన్నారు రాజుగారు.

“ఓ రాజా! మీ అంతరాత్మ ఎటుపోయింది? నిరాకారుడైన ఆ పరమాత్మని, సాకారంగా మీరు ఎలా దర్శిస్తారు, అసలు?” అన్నదా పిల్ల. పదునుగా అన్న ఆ మాటలు రాజుగారిని శూలాల్లా వేధించాయి. ఆ క్షణంలోనే ఆయనకు “మీరూ చెబుతారు అబద్ధాలు” అని ఆ అమ్మాయి గతంలో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆయన సంతోషంగా నవ్వి, తనకు అసలు దేవుడు ఏకొంచెంగా కూడా కనబడలేదని అంగీకరించాడు. వెంటనే మంత్రులిద్దరూ కూడా, సగం సిగ్గుతో, సగం భయంతో తలలు వంచుకొని, తమకూ దేవుడు కనబడలేదని ఒప్పుకున్నారు. అప్పుడా అమ్మాయి అన్నది రాజుతో- “రాజా, మేమంటే సాధారణ జీవులం. మా ప్రాణాలు నిలుపుకునేందుకుగాను అప్పుడప్పుడూ అబద్ధాలు చెబుతుంటాం. కానీ మీ అంతటివారికి ఏం భయం? కాబట్టి, చూడండి- ” అబధ్ధాలు చెప్పేందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి; కానీ ఎవరికైనా సరే, వాళ్ళు చెప్పే అబద్ధాలు చాలా రుచిగా, ఇష్టంగా తోస్తాయి” అన్నది.

రాజుగారికి ఆ అమ్మాయి తెలివితేటలకూ, ఆమె ధైర్యానికీ ముచ్చటవేసింది. ఆమె అంగీకారంతో ఆయన ఆమెను ఆ క్షణంనుండే తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకున్నాడు. తదుపరి, ఆమె రాజుగారికి కోడలై, తన తెలివితేటలు, చురుకుదనాల కారణంగా ఖండ ఖండాలా కీర్తినార్జించింది.

(శ్రీ.ఎ.కె. రామానుజన్ గారు సంకలీకరించిన Folk tales from India పుస్తకంలోని ఓ కధకు తెలుగు స్వేచ్ఛానువాదం ఇది. దీన్ని కొత్తపల్లి పత్రికకోసం చేశాను గానీ, కథా పరంగా పిల్లలకు సరిపోదనిపించింది..)