శ్రోతలు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు నవ్వుతారు?

మే 12, 2009

ఒక ముస్లిం ఖాజీగారు ఓ రోజున మసీదులో ప్రవచిస్తున్నారు: పాపాలు చేసినవారికోసం నరకంలో ఎలాంటి శిక్షలు ఎదురుచూస్తున్నాయో మహోత్సాహంగా వివరిస్తూ పోతున్నారు.  ఆయన వాక్ప్రవాహం కట్టలు తెంచుకొని పారుతున్నది.  -ఆ సమయంలో శ్రోతల్లో ఒక పేదరైతు కళ్ళలో కన్నీటిని గమనించి ఆయన మరింత ఉత్సాహ పడ్డాడు.  రైతు కన్నీళ్ళు చారికలు కట్టేలా ఏడుస్తున్నాడు కూర్చుని.

“ఓహ్, నీ పాపాలు ఈనాటికి నిన్ను భయపెట్టాయన్నమాట!  నువ్వు చేసిన పాపాలు గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా, ఇప్పుడు?” అడిగారు ఖాజీగారు, సూటిగా- తన వాక్యాలు శ్రోతలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో చూసుకొని గర్వపడుతూ.  “నా మాటలు తూట్లు పొడిచాయి కదూ, నిన్ను!?  నేను నరకపు జ్వాలల గురించి చెబుతున్నప్పుడు నీకు నీ పాపాలు గుర్తొస్తున్నాయి, కదూ?”

‘లేదు, లేదు!” అన్నాడు రైతు కన్నీళ్ళు తుడుచుకుంటూ.  “నేను నా పాపాన్ని గురించి కాదు, ఆలోచిస్తున్నది.  పోయిన సంవత్సరం రోగం వచ్చి, అన్యాయంగా చచ్చిపోయిన నా మేకపోతును గురించి ఆలోచిస్తున్నాను నేను.  పాపం! ఎంత నష్టం! నా మేకపోతుకు చక్కని గడ్డం ఉండేది- అచ్చు మీ గడ్డం లాంటిదే!  నా మేకపోతు గడ్డంతో అంతగా సరిపోలే గడ్డం నాకు ఇంతవరకూ తారసపడలేదు!” అన్నాడు రైతు అమాయకంగా.

ఇది విని, చుట్టూ ఉన్న రైతులందరూ విరగబడి నవ్వారు.

ఖాజీగారు పవిత్ర ఖురాన్ శరణు జొచ్చారు మళ్ళీ.

(ఈ కథ శ్రీ.ఎ.కె.రామానుజన్ గారి Folk tales from India పుస్తకంలోని ఓ కథకు తెలుగు స్వేచ్ఛానువాదం.  కొత్తపల్లి పత్రిక కోసం దీన్ని  అనువదించటమైంది.)

రాజుగారూ- నలుగురు అమ్మాయిలూ

మే 12, 2009

చాలా కాలం క్రిందట ఓ రాజుగారు ఉండేవారు. ఉదయంపూట దర్బారులో రాచకార్యాలు నెరపిన తరువాత, రాత్రిపూట ఆయన మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల బాగోగులు తెలుసుకునేవాడు.

ఓసారి అలా నగర సంచారం చేస్తుండగా ఓ ఉద్యానవనంలో‌చెట్లమధ్య, దీపాల వెలుతుర్లో కూర్చొని ముచ్చటించుకుంటున్న అమ్మాయిలు నలుగురు కనిపించారు. చర్చ ఏదో రసవత్తరంగా సాగుతోందని రాజుగారూ ఆ ప్రక్కగా నిలబడి వినటం మొదలుపెట్టారు. మొదటి అమ్మాయి అంటోంది- “అన్ని రుచుల్లోకీ మాంసం రుచే గొప్పగా ఉంటుంది” అని.

“నేను ఒప్పుకోను. చక్కని ద్రాక్ష సారాయిని మించిన రుచి ప్రపంచంలో దేనికీ ఉండదు” అని రెండో అమ్మాయి.

“లేదు లేదు. మీరిద్దరు చెప్పిందీ తప్పే. ప్రపంచంలో ప్రేమకంటే తీయనిది ఏదీ లేదు” అన్నది మూడో పిల్ల.

ఇక నాలుగో అమ్మాయి అంటున్నది- “మాంసం, సారాయి, ప్రేమ- ఇవన్నీ తీయనివే, కాదనను. కానీ అబద్ధాలు చెప్పటంలో ఉండే రుచి వీటిల్లో దేంట్లోనూ లేదు” అని.

అంతలో ఎవరో వచ్చి పిలవటంతో ఆ నలుగురూ లేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. వీళ్లమాటల్ని శ్రద్ధగా విన్న రాజుగారు ఎవరు ఏ ఇంటికి వెళ్ళారో గుర్తు పెట్టుకొని, ఆ పైన ఆ ఇళ్ల తలుపులమీద సుద్దతో గుర్తులు పెట్టి, చక్కా పోయారు.

మరునాడు ఉదయం రాజుగారు మంత్రిని పిలిచి, ఉద్యానవనానికి దగ్గర్లో సుద్ద గుర్తులున్న ఇళ్ళ యజమానుల్ని- వాళ్ల పిల్లల్తో సహా తన అంత:పురానికి రప్పించమని, నాలుగు పల్లకీలనిచ్చి పంపాడు.

నలుగురూ రాగానే, రాజుగారు వాళ్లని ముందుగదిలో కూర్చోమని, తాను ఒక్కొక్కరితోటీ విడివిడిగా మాట్లాడారు. మొదటి అమ్మాయిని పిలిచి అడిగారు: తల్లీ, నిన్న రాత్రి నువ్వు నీ స్నేహితురాళ్లతో కలిసి చెట్టుక్రింద కూర్చున్నప్పుడు ఏదో అంటూ ఉన్నావు, ఏమిటది?’ అని.

“మీకు వ్యతిరేకంగా ఏమీ అనలేదు, ప్రభూ!” అన్నదా అమ్మాయి.

“అవును, ఆ సంగతి నాకుతెలుసు. కేవలం నిన్న నువ్వు ఏమన్నావో చెప్పు, చాలు” అన్నారు రాజుగారు.

‘ “అన్ని రుచుల్లోకీ మాంసపు రుచి చాలా గొప్పది” అన్నాను ప్రభూ!’ అన్నది ఆ అమ్మాయి.

“సరే, నువ్వెవరి బిడ్డవు?” అడిగారు రాజుగారు.

నేను భాభ్రా జాతి బిడ్డను” అన్నదా అమ్మాయి.

“మరైతే నీకు మాంసపు రుచి ఎలా తెలుసు? మీ జాతివాళ్ళు మాంసాన్ని ముట్టనైనా ముట్టరు కదా? పురుగులేమైనా వస్తాయేమోనని, త్రాగే నీళ్ళను సైతం వడబోసుకొని త్రాగుతారే?” అన్నారు రాజుగారు.

“నిజంచ్ ఎప్పారు మహారాజా! కానీ‌మాంసం అత్యంత రుచికరమైనదని నేను గమనించి తెలుసుకున్నాను. మా ఇంటికి దగ్గర్లోనే ఒక కసాయి దుకాణం ఉన్నది. నేను చూశాను- జనాలు మాంసం కొన్న తరువాత ఒక్క చిన్న ముక్కని కూడా వృధా చేయరు. ఒక్క ముక్కనికూడా పారెయ్యరు. బహుశ: అది చాలా విలువైనది అయిఉండాలి. వాళ్ళు మాంసం వండుకొని తినేసి, ఎముకల్ని బయట పడేస్తే, కుక్కలు ఆ ఎముకల్ని దొరక పుచ్చుకొని బాణం ములుకుల మాదిరి చప్పరించివేస్తాయి. ఆ తరువాత కాకులు వచ్చి, మిగిలిన ముక్కల్నీ ఎత్తుకుపోతాయి. ఒకసారి కాకులు తమపని ముగించిన తరువాత, చీమల గుంపులు మిగిలినవాటిని ఎత్తుకెళ్తాయి. ఇవన్నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాయి” అన్నదా అమ్మాయి.

రాజుగారికి ఆమె విశ్లేషణా చాతుర్యం నచ్చింది. “చక్కగా చెప్పావు తల్లీ, మాంసం నిజంగానే చాలా రుచిగా ఉంటుంది” అని, ఆయన ఆమెకు ఒక చక్కని బహుమతినిచ్చి పంపాడు.

ఆ తరువాత, రెండవ అమ్మాయిని పిలిచి, రాజుగారు ఆమెనూ అడిగారు- ” నిన్న రాత్రి చెట్టుక్రింద కూర్చొని, నువ్వు ఏమి అన్నావు?” అని.

“మీ గురించి ఏమీ అనలేదు ప్రభూ, ప్రసంగంలో భాగంగా ‘ద్రాక్ష సారాయిని మించిన రుచి వేరే దేనిలోనూ ఉండదు ‘ అన్నాను నేను” అన్నదా అమ్మాయి.

“ఓహో, నువ్వెవరి పిల్లవు?” అడిగారు రాజుగారు.

“నేను పూజారిగారి అమ్మాయిని” అని బదులిచ్చింది ఆ పిల్ల.

“ఊ, ఇదేదో చోద్యంగానే ఉన్నది. పూజారికీ, ద్రాక్ష సారాయికీ ఆమడ దూరం ఉండాలే, మరి నీకు ద్రాక్షసారాయిలో రుచి ఎలా తెలిసింది?” అని అడిగారు, రాజుగారు.

ఆ అమ్మాయి అన్నది:” నేను ఏనాడు సారాయిని రుచి చూడలేదన్నది నిజమే. కానీ అదెంత రుచిగా ఉంటుందో ఊహించగలను, నేను. నేను మా యింటి మేడమీద అటూ ఇటూ తిరుగుతూన్నప్పుడు, క్రింద వీధిలోజరిగే సంగతులన్నీ కనబడుతుంటాయి. మా వీధిలోనే ఒక సారాయి దుకాణం ఉన్నది. ఒక రోజున, మంచి విలువైన దుస్తులు ధరించిని ఇద్దరు వచ్చి, అక్కడ కూర్చొని, ద్రాక్షసారాయిని త్రాగారు. ఆ తరువాత వాళ్ళు లేచి, తూలుకుంటూ నడవగా, నేను పైనుండి చూసి అనుకున్నాను-“వీళ్లను చూడు, రోడ్డుమీద దుమ్ములోను, బురదలోను పడుతూ, లేస్తూ, దోడలకు గుద్దుకుంటూ, అడుగడుక్కీ తూలుతూ ఎలా పోతున్నారో చూడు? ఈ అనుభవంతో వాళ్ళు జన్మలో ఇక సారాయిని ముట్టరు మళ్ళీ” అని. కానీ నా ఊహ తప్పని తేలింది. వాళ్ళు తరువాతి రోజునే వచ్చారు, మళ్ళీ అదే పని చేసి, మళ్ళీ అలాగే ప్రవర్తించారు. అప్పుడు నేను అనుకున్నాను-” ద్రాక్షసారాయి చాలా రుచికరంగా ఉండి ఉండాలి. లేకపోతే మనుషులు దానికోసం ఇన్ని పాట్లు ఎందుకు పడతారు?” అని.

“అవును తల్లీ, నువ్వు సరిగానే ఊహించావు. ద్రాక్ష సారాయి నిజంగానే చాలా రుచిగా ఉంటుంది” అని రాజుగారు ఆమెకో బహుమతిని ఇచ్చి పంపారు.

ఆ తరువాత ఆయన మూడో అమ్మాయిని పిలిచి అడిగారు- “నిన్నరాత్రి నువ్వు ఏదో అంటున్నావు, మీ స్నేహితురాళ్లతో- ఏంటమ్మా అది?” అని.

“ఆమె అన్నది-“మీ గురించి ఏమీ అనలేదు ప్రభూ, ఏదో చర్చ జరుగుతుంటే ‘ ప్రేమించడంలోని తియ్యదనం వేరే ఎందులోనూ లేదు ‘ అన్నాను మహారాజా” అని.

” అయ్యో, చూస్తే నువ్వింత చిన్న పిల్లవు!? అప్పుడే అలాంటి సంగతులు ఎలా మాట్లాడగల్గుతున్నావు? ఇంతకీ ఎవరి అమ్మాయివి, నువ్వు?” అడిగారు రాజుగారు.

“నేనొక వీధిగాయకుని బిడ్డను” అన్నదా అమ్మాయి. “నేనింకా చిన్న పిల్లనే, కానీ నాకు కళ్ళు, చెవులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడు పుట్టినప్పుడు మా అమ్మ ఎంతో కష్టపడింది. ఆమె బ్రతుకుతుందని అనుకోలేదు ఎవ్వరూ. అయినా, ఆమె కోలుకున్న వెంటనే ప్రేమికుల్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్లిపోయింది. అందుకనే, ‘ప్రేమించటంలోని మాధుర్యం వేరే ఎందులోనూ ఉండదన్నాను నేను” అన్నది.

“బాగా చెప్పావు తల్లీ” అని రాజుగారు ఆమెకూ బహుమతినిచ్చి పంపారు.

ఆ తరువాత రాజుగారు నాలుగవ అమ్మాయిని అదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమెకూడా “రాజుగారిని నేనేమీ అనలేదు” అన్నది.
“అయిఉండవచ్చు; కానీ నువ్వన్నదేమిటి?” అడిగారు రాజుగారు.

“అబద్ధాలు చెప్పటంలో ఉండే రుచి, అందరికీ తెలుసునన్నాను నేను.”

“నువ్వెవరి బిడ్డవు?”

“నేను రైతు బిడ్డను”.

“అబద్ధాలు చెప్పటం బాగుంటుందని నీకెలా తెలుసు?” అన్నారు రాజుగారు.

చురుకుగా ఉంది ఆ అమ్మాయి- అన్నది: ” ప్రతివాళ్లూ అబద్ధాలు చెబుతారు. ఓహ్, దానిదేముంది? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పారో, లేదో గాని, సందర్భం వస్తే మీరూ అబద్ధం చెబుతారు ఏదో ఒకనాడు!” అని.

“నేనా?! ఎలా?!” అన్నారు రాజుగారు.

“నాకు రెండు లక్షల బంగారు నాణాలు, ఆరు నెలల గడువూ ఇవ్వండి. మీరూ అబద్ధాలు ఆడతారని ఋజువు చేస్తాను.” అన్నదా అమ్మాయి ధైర్యంగా.

రాజుగారు కొంచెం ఆలోచించి, సరేనన్నారు. ఆమెకు రెండు లక్షల వరహాలు ఇచ్చి, ఆరునెలలు ఆగేందుకు అంగీకరించారు. ఈ ఆరు నెలల్లోనూ, ఆ అమ్మాయి రాజుగారి డబ్బుతో గొప్ప భవంతిని ఒకదాన్ని నిర్మించింది. ఆ భవంతి లోపలి గోడలు నున్నగా, పట్టు పరదాల మాదిరి ఉన్నాయి. దానిలోని చిత్రాలు, శిల్పాలు అత్యంత రమణీయంగాను, అనుపమానంగాను ఉన్నై. ఆరు నెలలుగడుస్తాయనగా, ఆమె రాజుగారి వద్దకు వచ్చి అన్నది: “మహారాజా, రండి, నేను మీకు భగవంతుడిని చూపిస్తాను” అని.

కుతూహలం కొద్దీ రాజుగారు ఇద్దరు మంత్రుల్ని వెంటబెట్టుకొని ఆమె వెంట బయలుదేరారు.

ఆమె వాళ్లని తన భవంతి దగ్గరకు తీసుకు పోయింది. అక్కడ, దాని వాకిట వాళ్లను నిలిపి, “ఇదే, భగవంతుడు నివాసముండే చోటు. కానీ ఆయన గుంపుగా వెళ్తే కనబడడు. ఒక్కొక్కసారీ ఒక్కరికే దర్శనమిస్తాడాయన. అయితే, ఎవరి తల్లులు శీలవతులు కారో, పతివ్రతలు కారో, అలాంటి వాళ్లకి ఆయన దర్శనం లభించనే లభించదు. ఇక మీరు ఒక్కరొక్కరుగా లోనికి పోయి రండి” అన్నది.

రాజగారు సరేనని, తన మంత్రుల్లో ఒకరిని లోనికి పంపారు. ఆయన లోపలికి వెళ్ళి, అంతటా తిరిగి చూశాడు. చక్కని ఆ భవనం నిజంగానే భగవంతుని నివాసస్థలం మాదిరి పవిత్రంగా ఉన్నది. కానీ ఎంత వెతికినా అందులో ఆయనకు భగవంతుని దర్శనం మాత్రం కాలేదు. అప్పుడా మంత్రి అనుకున్నాడు- ఏమో, ఎవరి చరిత్ర ఎలాంటిదో ఎవరికి తెలుసు? నేనిప్పుడు బయటికి పోయి దేవుడు కనబడలేదని చెప్పుకోలేను. మా అమ్మ నడవడినే శంకిస్తారు అందరూ. అందుకని, నాకు భగవంతుడు కనిపించాడని చెబుతాను నేను…” -ఇలా అనుకొని, ఆయన బయటికి వచ్చాడు. రాజుగారు ప్రశ్నించినప్పుడు, ఆయన ఎలాంటి తడబాటూ లేకుండా బొంకాడు- “మిమ్మల్ని చూస్తున్నంత్ అస్పష్టంగా చూశాను దేవుడిని” అని.

“అవునా?, ఆయన్ని దర్శించారా? మీరున్నూ?” అన్నారు రాజుగారు. “దర్శించాను, నిజంగా!!”
“ఆయన మీతో ఏమన్నారు?” అడిగారు రాజుగారు. ” తను చెప్పిన సంగతుల్ని ఎవరికీ చెప్పద్దన్నారు ప్రభూ!” అన్నాడు మంత్రి తెలివిగా.

రాజుగారు రెండో మంత్రిని లోపలికి పంపాడు. లోపలికైతే వెళ్ళాడుగానీ, ఆయన గుండెలు పీచుమంటూనే ఉన్నాయి: ‘ఏమో, నాచరిత్ర ఎలాంటిదో, ఏమో?” అని. అద్భుతమైన ఆ భవన మధ్యంలో నిలబడి ఆ మంత్రిగారు అనుకున్నారు- “నాకు భగవంతుడు కనబడలేదంటే, ఖచ్చితంగా మా తల్లి శీలవతి అయిఉండదు. కానీ నేను ఆ సంగతిని ఒప్పుకుని, బహిరంగంగా అవమానాన్ని ఎలా, భరించేది? దానికంటే, దేవుడిని చూసినట్లు నటించటమే మంచిది.” -ఇలా అనుకొని, మంత్రి గారు నవ్వు ముఖంతో బయటికి వచ్చారు. రాజుగారు అడిగితే “నేను భగవంతుడిని చూడటమే కాదు, మాట్లాడాను కూడా.” అన్నాడు.

ఇప్పుడిక రాజుగారి వంతు వచ్చింది. ఆయన ధైర్యంగా భవంతిలోకి ప్రవేశించాడు; కానీ ఎంత వెతికినా భగవంతుని ఛాయకూడ లేదక్కడ! క్రమంగా ఆయనకూ ధైర్యం సన్నగిల్లింది. తన పుట్టుక మీద తనకే అనుమానం వేయటం మొదలైంది. ” మా మంత్రిగార్లిద్దరికీ భగవద్దర్శనమైంది. వారిద్దరూ ఉత్తమ సంజాతులేనని స్పష్టమైంది. మరి, నేను- మహారాజును- కళంక చరిత్రుడినా? అందుకనే నాకు భగవంతుడు కనబడటం లేదా? దీన్ని అంగీకరిస్తే అంతా గందరగోళం కాగలదు. అందుకని నేను భగవంతుని దర్శించానని చెప్పవలసిందే.” -ఇలా అనుకున్నాక రాజుగారు బయటికి వచ్చి మిగిలిన వారిని కలిశారు.
అక్కడే నిలబడి ఉన్న అమ్మాయి, అడిగింది రాజును: ” చెప్పండి మహారాజా, మీకు భగవంతుడు దర్శనమిచ్చాడా?” అని.

“అవును. నేను చూశాను ఆయన్ని.” అన్నారు రాజుగారు.

నిజంగానే!?” అన్నదా అమ్మాయి.

“అవును నిజంగా దర్శించాను” అన్నారు రాజుగారు.

“ఓ రాజా! మీ అంతరాత్మ ఎటుపోయింది? నిరాకారుడైన ఆ పరమాత్మని, సాకారంగా మీరు ఎలా దర్శిస్తారు, అసలు?” అన్నదా పిల్ల. పదునుగా అన్న ఆ మాటలు రాజుగారిని శూలాల్లా వేధించాయి. ఆ క్షణంలోనే ఆయనకు “మీరూ చెబుతారు అబద్ధాలు” అని ఆ అమ్మాయి గతంలో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆయన సంతోషంగా నవ్వి, తనకు అసలు దేవుడు ఏకొంచెంగా కూడా కనబడలేదని అంగీకరించాడు. వెంటనే మంత్రులిద్దరూ కూడా, సగం సిగ్గుతో, సగం భయంతో తలలు వంచుకొని, తమకూ దేవుడు కనబడలేదని ఒప్పుకున్నారు. అప్పుడా అమ్మాయి అన్నది రాజుతో- “రాజా, మేమంటే సాధారణ జీవులం. మా ప్రాణాలు నిలుపుకునేందుకుగాను అప్పుడప్పుడూ అబద్ధాలు చెబుతుంటాం. కానీ మీ అంతటివారికి ఏం భయం? కాబట్టి, చూడండి- ” అబధ్ధాలు చెప్పేందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి; కానీ ఎవరికైనా సరే, వాళ్ళు చెప్పే అబద్ధాలు చాలా రుచిగా, ఇష్టంగా తోస్తాయి” అన్నది.

రాజుగారికి ఆ అమ్మాయి తెలివితేటలకూ, ఆమె ధైర్యానికీ ముచ్చటవేసింది. ఆమె అంగీకారంతో ఆయన ఆమెను ఆ క్షణంనుండే తన వ్యక్తిగత సలహాదారుగా నియమించుకున్నాడు. తదుపరి, ఆమె రాజుగారికి కోడలై, తన తెలివితేటలు, చురుకుదనాల కారణంగా ఖండ ఖండాలా కీర్తినార్జించింది.

(శ్రీ.ఎ.కె. రామానుజన్ గారు సంకలీకరించిన Folk tales from India పుస్తకంలోని ఓ కధకు తెలుగు స్వేచ్ఛానువాదం ఇది. దీన్ని కొత్తపల్లి పత్రికకోసం చేశాను గానీ, కథా పరంగా పిల్లలకు సరిపోదనిపించింది..)

తెలుగమ్మకు కొత్త కర్పూరం

మే 9, 2009

అంతర్నాలమూ-మార్జాలమూ!రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.

జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- “అవి బాగానే వెలుగుతున్నై కదా?” అంటున్నారు. “అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, ‘మన తల్లేమీ వెనకబడలేద’ని ప్రపంచానికి చాటుదాం” అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.

‘చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో ‘పల్సార్లు ‘ అని రాస్తే, ప్రొద్దున వాడెవడో “ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?” అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి ‘తూపుదూబ ‘ (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని “అట్లనవలదార్యా” అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, “ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం” అన్నాడు వాడు. “పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?”‌ (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.

అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. “ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది” అన్నాడు ఆనందం, వస్తూనే.

“అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?” అని విస్తుపోయాడు రామారావు.

బదులుగా “ఆ!!” అని నిర్ఘాంతపోయాడు ఆనందం. “ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని ‘అంతర్జాలం’ అనాలి ” వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.

ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.

“అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను ‘అంతర్జాలం’ అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా “ఈవల” అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.

“ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని ‘ఇక్కడ ‘ అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం” అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.

“కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, (‘e’)’ఈ ‘ అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!” అన్నాడు ఆనందం వివరిస్తున్నట్లు.

ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని ‘పరస్పర సంబంధ వల ‘ అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం” అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.

“ఏమండీ, లేస్తారా, లేదా? ‘పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ‘ అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?” అరిచింది సరళ లోపల్నుండి.

“కోల!!” అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.

“జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి..” అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.

జూన్ నెల సంపాదకీయం (మొదటి డ్రాఫ్టు)

మే 8, 2009

జూన్ నెల వచ్చిందంటే పిల్లలంతా బడికెళ్లటం గురించి ఆలోచిస్తారు.

పిల్లలూ, వాళ్ళ తల్లిదండ్రులు కూడాను.

ఇప్పుడు పుస్తకాలు కొనాలి, యూనిఫాంలు. బ్యాగులు. బూట్లు, మేజోళ్లు, టైలు, బెల్టులు- ఎన్నెన్నో కొనాలి. ఇవన్నీ కాక బడివాళ్లకు ఫీజులు కట్టాలి. చాలామంది తల్లిదండ్రుల దగ్గర అన్ని డబ్బులుండవు. వీటన్నిటికీ డబ్బులు చాలకపోతే ఏం చేయాలి?

పల్లెల్లో పేద పిల్లలు ఉపాయాలు కనుక్కున్నారు: అచ్చు పుస్తకాలు కొనకపోతే సరి! బళ్ళల్లో టీచర్లు నోట్సులున్నాయో లేదో చూస్తుంటారు తప్పిస్తే, అచ్చు పుస్తకాల గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకని, వీళ్లెవరూ అచ్చుపుస్తకాలు కొనరు! ఇక సంవత్సరమంతా అచ్చుపుస్తకాలు చదవక, తమ తప్పుల తడక నోట్సుల్లో రాసుకున్న ప్రశ్నలు-జవాబుల్నే బట్టీ కొడుతూ గడిపేస్తారు. ఆ తరువాత ఆరేడు నెలలకి, జనవరి నెల రాగానే గైడ్లు గుర్తొస్తాయి! అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులను పోరి, గైడ్లు కొనుక్కుంటారు- అరకొర మార్కులతో, అవగాహన లేకుండా ముందు తరగతికి పోతుంటారు-

ఇలాంటి చదువులవల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం బాగా చదవాలి. కథలూ చదవాలి; అచ్చు పుస్తకాలూ చదవాలి; వార్తా పత్రికలూ చదవాలి. చదవటంలో సంతోషం రావాలి మనకు. అప్పుడు, ఆ సంతోషంలో, మనకు అన్నీ అర్థమౌతాయి. అర్థమైన సంగతులన్నీ జీవితాల్లోకి ఇంకుతాయి; మనందరికీ అవి ఉపయోగపడతాయి.

-ఏమంటారు?

ఈ విద్యా సంవత్సరంలో మనమంతా మరిన్ని తెలివితేటల్నీ, మరింత బలాన్నీ సంపాదిస్తామని ఆశిద్దాం.

(కొత్తపల్లి పత్రిక కోసం)

చరైవ..చరైవ..

మే 8, 2009

ఇరవై ఐదేళ్ళ క్రిందటి సంగతి…

రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.

చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.

వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. “ప్రగతి కాంవెంట్”లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ ‘మమ్మీ, డాడీ’లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా “ఐ ఈజ్ గుడ్” అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.

చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. ‘పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ‘ అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు – ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.

అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.

ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:

చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.

రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లో‌ఉన్న వృద్ధాశ్రమంలో‌చేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలో‌హాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం‌ ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.

అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. “గియానంద వోల్డేజ్ హోం” లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.

ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న ‘ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ‘ లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. “ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి” అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.

అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- “మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో” అని!

ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.

(నారాయణీయంలో నిన్న ప్రచురితం..)

ఓ ట్రాజెడీ..

మే 6, 2009

రామారావుకు సహనం ఎక్కువ అనుకుంటుంటారు అంతా. కానీ సరళకూ, సరళ తల్లిదండ్రులకూ మాత్రం అసలు సంగతి తెలుసు- రామారావుకున్నంత కోపం, చికాకు, అసహనం ప్రపంచంలో వేరెవరికీ ఉండవంటుంది సరళ. రామారావు పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే, పదిసార్లు పిలిస్తే తప్ప పలకడు. అదీ ఏదోలా ముఖం పెట్టుకొని విన్నట్లు వింటాడు. పదిసార్లు అలా పిలిస్తే- (అంటే పదిపదులు వందసార్లన్నమాట!) అప్పుడు ఇక చికాకు పడూతూ కాఘితాలు పక్కన పడేసి లేస్తాడు తను. ఆపైన మాట మాట్లాడకుండా చెప్పిన పని చేస్తాడు. సరళకే అనిపించాలన్నమాట- “ఎందుకు కదిల్చాంరా, భగవంతుడా!” అని.

సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.

రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. “పాపం, రామారావు మంచోడు” అనుకునేవాళ్ళు అందరూ.

పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. “పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?” అని సరళ వేధించేది. “మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా” అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.

గొడవలు బాగా ఎక్కువైతే “వదిలిపెట్టి పారిపోతా”ననేది సరళ. “నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని” అనేవాడు రామారావు. “ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి ” అనేది సరళ. “ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?” అని గొణిగేవాడు రామారావు.

రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , “మీకేంతెలుసు” అనుకునేది. “రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం” అని పోట్లాడేది సరళ. “వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా” అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.

“తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు” అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. “ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను” అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.

మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.

“పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!” అనుకున్నారు ఇరుగుపొరుగులు.

“ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు” అనుకున్నది సరళ.

(ఈ రోజునే నారాయణీయంలో ప్రచురితం)